మనుషులను చంపేసి ఎన్నికలు నిర్వహిస్తారా..?.. కోపంతో ఊగిపోయిన చంద్రబాబు..??

వాస్తవం ప్రతినిధి: స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. క్యాస్ట్‌, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. రాడ్లతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసే ఉన్మాద చర్యను తాము సహించబోమని చంద్రబాబు చెప్పారు. ఇంత ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నుండి వెల్దుర్తి, దుర్గి వరకు మోటార్ బైక్ లపై వెళ్లి వెంటాడి మరీ దాడులు చేస్తున్నారని ఇక దీనికి పోలిసులే సమాధానం చెప్పాలని అన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాచర్ల నుంచి వెల్దుర్తికి వెళ్లి సీఐ కారులో వెళ్తుంటే మళ్లీ దాడి చేశారని, మాచర్లలో పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన లాయర్‌ కిశోర్‌పై కూడా దాడికి పాల్పడ్డారని చెప్పారు. మాచర్లలో పోలీసులపై దాడులు చేస్తే డీజీపీ ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. మనుషులను చంపేసి ఎన్నికలు నిర్వహిస్తారా?..టీడీపీ నేతలపై దాడులు జరిగితే డీజీపీ చర్యలు తీసుకోరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.