జయహో మహిళా!!

 వాస్తవం పాఠకులకు మరియు వీక్షకులకు నమస్కారం … ముందుగా వాస్తవం మహిళా పాఠకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

సృష్టికి మూలం మహిళ.. మహిళ లేనిదే మనుగడ లేదు… తల్లిగా ,చెల్లిగా, అర్దాంగిగా ఎన్నో పాత్రలు ఆమె సొంతం… నింగిలో సగం … ఆకాశంలో సగం ..జనాభాలో నూ సగం. కుటుంబం కోసం రేయనకా పగలనకా శ్రమించే వారికోసం ఓ ప్రత్యేక రోజు ఏర్పాటైంది. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

ప్రతి ఏటా మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.. అయితే అసలు మహిళా దినోత్సవం ఎప్పుడు ఆరంభమైంది.. ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే కొన్న ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.

 రోజంతా శ్రమించినా వచ్చే కూలీతో పొట్టనిండని రోజులవి… రెక్కాడితే కాని డొక్కాడని వేతన జీవులు .. వేతనం సరిపోక పెంపుదల కోసం ఐక్యమయ్యారు ..చైతన్య వంతులుగా తయారై పోరాటానికి శ్రీకారం చుట్టిన రోజులవి.. 1908 లో న్యూయార్కు లో వేలాది మంది మహిళా శ్రమజీవులు వేతన పెంపుదల కోసం భారీ ఉద్యమం చేసారు.. అలా మొదలైన ఉద్యమం క్రమేణా ఓటు హక్కు కావాలని పోరాటానికి ఊపిరిలూదింది. క్రమేణా మహిళ దినోత్సవంగా రూపాంతరం చెందింది..

వారు చూపిన తెగువ ప్రపంచంలోని ఇతర దేశాలకు స్పూర్తినింపింది.. 1909 లో అమెరికా లో జాతీయ మహిళా దినోత్సవం గా జరిపారు.. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి మార్చి 8 ని 1975 లో ప్రపంచ మహిళా దినోత్సవం గా జరుపుకోవాలని నిర్ణయించింది.. అప్పటి నుండి నేటి వరకు అంటే 45 సంవత్సరాలు గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.

రామాయాణం , మహాభారతంతో పాటు దైవత్వం లో కూడా దేవతలదే అగ్రస్థానం .. లక్ష్మీదేవిగా , పరా శక్తిగా, శాంత స్వరూపినీ గా , దుర్గమ్మ గా మహిళల ధైర్య ,కరుణ సాహాసాలకు ప్రతిరూపంగా ముక్కోటి దేవతలు కొలువుదీరి పూజలందుకుంటున్నారు.

పృకృతి లో కూడా స్త్రీలకు ప్రత్యేకత దాగి ఉంది.. నీటి బొట్టుగా మొదలై వాగులు వంకలు ద్వారా సెలయేరుగా పారే జీవనదులు క్రిష్ణవేణి, గంగా , కావేరి , నర్మదా , సరస్వతి , పేర్లు కూడా మహిళలవే .
మన సమాజంలో మహిళలంటే ఎనలేని గౌరవం . పూర్వం నుండి స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానంచూపుతారు.. మహిళలను దేవతలుగా బావించేవారని పురాణాలు చెపుతున్నాయి.. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ రాజ్యాలు సుఖ సౌఖ్యాలుంటాయని చెపుతారు.. మహిళల గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఎన్నో కథలు పాటలు , డైలాగ్ లు ప్రాచుర్యత సంతరించుకున్నాయి..
యత్ర నార్యంతే పూజ్యతే… తత్ర దేవతా!!

బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి వీడిన స్వతంత్ర్య బారతంలో మహిళలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు విధులు, భాద్యతలను కల్పించింది. పాలకులు ఎన్నో చట్టాలు తెచ్చారు.. ఎన్ని ఉన్నా నేడు మహిళలకు రక్షణ కరువైంది..

1947 కు పూర్వం మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. వారికి స్వేచ్చ , స్వాతంత్ర్యంలు తక్కువ .. అణువణువునా భయం గుప్పిట్లో జీవించేవారు.. మహిళలను ఒక ఆట వస్తువు గా చూసేవారు. అందుకే నాడు జాతి పిత మహాత్మగాంధి ఆడది అర్దరాత్రి ఒంటరిగా స్వేచ్చగా తిరగగలిగిననాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్నారు.. స్వాంతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అయినా ఇంకా నేటి సమాజంలో మహిళల రక్షణ భద్రత అనేది చర్చనీయాంశంగా మారింది.. దేశ ప్రధాని గా పనిచేసిన ఇందిరా గాంధి మహిళలకే వన్నె తెచ్చి హత్యకు గురయ్యారు. ఆంద్రప్రదేశ్ నాడు నందమూరి తారకరామరావు మహిళలకు ఆస్తి హక్కులో స్త్రీలకు బాగస్వామ్యం కల్పించారు. మహిళల సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేసారు. అయినా ఇంకా ఎక్కడో వెలితి కన్పిస్తుంది .. గడప దాటి బయటకు వెల్లే నారీమణులు తిరిగి ఇంటికి చేరేవరకు టెన్షన్ ..టెన్షన్ నెలకొని ఉంటుంది.. నిర్బయ, ధిశ లాంటి వారు కామాంధుల చేతిలో బలయ్యారు.. ఎన్ని చట్టాలున్నా మహిళలకు ఇంకా భద్రత కరువైంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త గా తీసుకువచ్చిన దిశ చట్టం అయినా దశ మార్చుతుందో లేదో చూడాలి.

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు అంతరిక్షం వరకు వెళ్లగలుగుతోంది.. రంగం ఏదైనా ఎంత కష్టమైనా అలవోకగా పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు.

ప్రపంచ జనాబా ఏడు వందల కోట్లు ఉంటే అందులో సగం మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఏమి చేయలేరు వంట ఇంటికే పరిమితమనే మాటలకు స్వస్థి చెప్పారు.. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు విద్యావంతులుగా తయారవడంతో మంచి మార్పు వచ్చింది.ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ యువతి ఏకంగా రైలు ను నడుపుతోంది.. మరో మహిళ విమానాలు నడుపుతోంది.. ఐఎఎస్ , ఐపిఎస్ , వైద్యులు, ఇంజనీర్లు తో పాటు ఉన్నత అధికారులుగా వివిధ స్థానాల్లో మహిళలు రాణిస్తున్నారు..

చదువుకు దూరమైన మహిళలు వారి వంతు చేతి వృత్తులుగా , చిరుద్యోగులుగా , శ్రామికులుగా ఎంతో మంది రాణిస్తున్నారు.. ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతున్నారు. సమాజ సేవలో బాగం అవుతున్నారు. జన ఆరోగ్యం కోసం వారి జీవితాలను పణం గా పెడుతున్నారు పారిశుద్య కార్మికులు

మహిళలకు అన్నీ ఉన్నా రాజ్యాధికారం దక్కిననాడే నిజమైన మార్పు వస్తుందంటారు.. ఆడది అబల కాదు సబల అంటారే తప్ప మహిళా బిల్లుకు మాత్రం మొక్షం కలిగించడంలేదు. ప్రజా స్వామ్యంలో రాజ్యాధికారం ఎంతో ముఖ్యం . రాజకీయ అవకాశాలు మెండుగా మహిళలకు దక్కితే చాలా మార్పు వస్తుంది.. ఇప్పటికే రాజకీయాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ లో 50 శాతం రిజర్వేషన్ కల్పించింది.ఉద్యోగాల్లో 33 శాతం కల్పించారు. చట్టసభల్లో మాత్రం మహిళా బిల్లుకు మోక్షం కలగడంలేదు. అందరూ శాఖా హారులే రొయ్యల ముల్లె పోయింది అన్నట్లు ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా బిల్లు కు మోక్షం కలగడంలేదు. ఇదీ మహిళల పై ఉన్న మక్కువ

మహిళా దినోత్సవాలనాడు అంబరాలనంటే సంబరాలు జరిపి శుభాకాంక్షల తో సరిప పెట్టకుండా నిజమైన స్వేచ్చ, స్వాతంత్య్రాలు రక్షణ , భద్రత కలిగి ఉండేలా పాటు పడదాం.. గాంధీజి కలలు గన్న మహిళల స్వేచ్చను సాధిద్దాం .