సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..ఏపీలో “వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్స్ “

వాస్తవం ప్రతినిధి: వైసీపీ పార్టీ అధినేత , ఏపీ సీ ఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్ర ప్రజలందరికోసం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా “వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌” లను నిర్మించడానికి సీఎం జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ క్లినిక్ ల కోసమై సీఎం జగన్ సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.. ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపిన వైఎస్ జగన్ వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8వ తేదీన దీనిని లాంచ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా రెండు వేల జనాభా యూనిట్‌గా, స్థానిక పరిస్థితులకు తగ్గట్లు విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని, ఈ క్లినిక్ లో 24 గంటలు ఒక బీఎస్సీ నర్సింగ్‌ చదివిన నర్సింగ్‌ స్టాఫ్‌ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

కనీసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికి ఉచితంగా వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని, చిన్న చిన్న చికిత్సలకు ఇక్కడే వైద్యం అందుతుందని, పెద్ద సమస్యలకు మంచి రెఫరల్ పాయింట్ గా పనిచేస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రతీ గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఈ క్లినిక్ లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇకపోతే ప్రతి జిల్లాకు ఒక టీచింగ్‌ హస్పిటల్‌ ఉండాలని, ప్రతి టీచింగ్‌ హాస్పిటల్‌లో డెంటల్‌ ఎడ్యుకేషన్‌ కూడా ఉండాలని సీఎం జగన్ వాఖ్యానించారు. కాగా ఇప్పటికే ఈ క్లినిక్ ల విషయంలో సీఎం జగన్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారని సమాచారం.