ప్రతీ ఎంబసీలో ఒక తెలుగు మాట్లాడగలిగే అధికారి ని నియమించాలి..!!

వాస్తవం ప్రతినిధి: ఉపాధి వేటలో కుటుంబ సభ్యులను విడిచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లి కష్టపడుతున్న ప్రవాస భారతీయులకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించి అమలు చేయాలని వలసదారుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు కోరారు. ఒక ప్రముఖ పత్రిక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాళ్ట్లాడుతూ.. వివిధ సంస్థలు సర్వేల్లో అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 20 – 25 లక్షల మంది వివిధ దేశాలకు వలస వెళ్లారని. వీరిలో అత్యధికంగా గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమాన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్‌తో పాటు మలేషియా, సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఉపాధి కోసం వలస వెళ్లారని. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పని వారిగా చేరారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో.. ఎలా సంప్రదించాలో కూడా కనీస అవగాహన లేని దుస్థితిలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి విదేశాల్లో.. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో ప్రతీ ఎంబసీలో ఒక తెలుగు మాట్లాడగలిగే అధికారిని నియమించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి అని, లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ దేశంలో ఒక తెలుగు అధికారిని నియమించాలి అని తెలిపారు.