ధోనిపై కపిల్‌ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భారత దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. హెచ్‌సీఎల్‌ 5 వ వార్షికోత్సవం గ్రాండ్‌ ఈవెంట్‌ను గురువారం నోయిడాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కపిల్‌ దేవ్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఆడటంలో పెద్ద విశేషమేమీ లేదని కపిల్‌ చెప్పుకొచ్చాడు. ధోని తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడని. ఒక అభిమానిగా మాత్రం అతను జట్టులో ఉండాలని కోరుకుంటానని కపిల్ తెలిపాడు. ‘ఐపీఎల్‌లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నారు. వారిలో మనం గర్వించే ఆటగాళ్లను వచ్చే పదేళ్లలో చూడనున్నాం .నా దృష్టిలో ధోనీ ఇప్పటికే దేశానికి చాలా సేవ చేశాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాది పూర్తి కావొస్తోంది. అక్టోబర్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఉండాలంటే ధోని వచ్చే ఐపీఎల్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ధోని తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడు. ఒక అభిమానిగా అతను జట్టులో ఉండాలని కోరుకుంటా.. కానీ కొత్త తరానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తా’ అని కపిల్ పేర్కొన్నాడు.