పీకే పై చీటింగ్‌ (420) కేసు కేసు నమోదు

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ పై పాట్నా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసిన ఘటన ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి ‘బీహార్ కి బాత్’ ప్రచారానికి వాడుకున్నారని శశ్వత్ గౌతమ్ పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు.

జేడీయూకు రాజీనామా చేసిన తర్వాత.. తాను ఫిబ్రవరి 20 నుంచి బాత్‌ బీహార్‌ కీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ కార్యక్రమాన్ని కాపీ కొట్టారని బీహార్‌లోని మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. కిషోర్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తాను బీహార్‌ కీ బాత్‌ అనే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించానని, దాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ కాపీ కొట్టి ఫిబ్రవరి నెలలో బాత్‌ బీహార్‌ కీ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారని గౌతమ్‌ పేర్కొన్నాడు. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌పై 420, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర ప‌ట్టిక(ఎన్ఆర్సీ)కి వ్య‌తిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని ప్రశాంత్ కిషోర్ ఈ నెల 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. బీహార్‌కు కొత్త నేత అవ‌స‌రం అన్న ల‌క్ష్యంతో బాత్‌ బీహార్‌ కీ ఉద్య‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రానున్న వంద రోజుల్లో కోటి మంది యువ‌త‌ను త‌మ ఉద్య‌మంలో భాగం చేస్తామ‌ని ప్రకటించారు.