చంద్రబాబుకి ఛాలెంజ్ విసిరిన మంత్రి అవంతి..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం బయట విశాఖ ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ప్రజా చైతన్య యాత్ర ఉత్తరాంధ్రలో చేయాలని భావించి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వచ్చిన చంద్రబాబుకి విశాఖ ప్రజలు నిరసనలు ఆందోళనలు చేస్తూ గోబ్యాక్ చంద్రబాబు అంటూ నినదించారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ గోల గోల చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ జగన్ పులివెందుల నుండి రౌడీలను తీసుకువచ్చి చంద్రబాబుని అడ్డుకున్నారని బహిరంగంగా మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది. దీంతో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుకి ఈ విషయంపై చాలెంజ్ విసిరారు. విశాఖ పట్నం విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్నవారిలో పులివెందుల నుంచి వచ్చిన వారు ఉన్నారని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అలా రుజువు చేయలేకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు ఉత్తరాంద్ర ప్రజలను అవమానించడమే కాకుండా, ఈ ప్రాంతంలో దౌర్జన్యం చేయడానికి వచ్చారని, ప్రజలు ఆయనపై చాలా ఆగ్రహంగా ఉన్నారని అవంతి అన్నారు. లోకేష్ చేసే వ్యాఖ్యలు కూడా చంద్రబాబును అడ్డుకోవడానికి కారణమయ్యాయని అన్నారు. ఉత్తరాంద్ర ప్రజలే చంద్రబాబును అడ్డుకున్నారని ఆయన అన్నారు.