జగన్ పాలనపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

వాస్తవం ప్రతినిధి: ఒక్క రాష్ట్రం తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయంగా మొత్తం దేశ ప్రతిష్ఠ దెబ్బతిందని అంటూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల స్వయంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రస్తావించకుండా… ‘దక్షిణాదిలోని ఒక రాష్ట్రం’ అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్య ఢిల్లీలో జరిగిన సీఐఐ – ఆస్కాన్‌ సదస్సులో పీయూష్‌ చేసిన విమర్శలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ‘‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై దక్షిణాదిన ఓ రాష్ట్రం చేపట్టిన సమీక్ష వల్ల భారతదేశం ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతినింది’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

‘‘రాజకీయ, ప్రభుత్వాల మార్పులకు అతీతంగా… చట్టపరమైన ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా ఒక నియమావళి రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఏదైనా రాష్ట్రం సదరు ఒప్పందాలను పునఃసమీక్షిస్తే… ఆ రాష్ట్రానికి విడుదల చేసే నిధుల్లో రిజర్వు బ్యాంకు కోత విధించి… ఆ మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థకు చెల్లించేలా ఉండాలి. అంతే తప్ప మొత్తం దేశ ఖ్యాతిని నాశనం చేసే పరిస్థితికి అవకాశం కల్పించవద్దు’’ అని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.