ఢిల్లీ అగ్నిగుండంలా మారితే అమిత్ షా చోద్యం చూస్తున్నారా..?

వాస్తవం ప్రతినిధి: గత మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళలనతో అట్టుడుకుతోంది. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటికి 39 మంది మరణించారు. 45 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. దేశ రాజధానిలో జరిగిన హింసాకాండపై కేంద్రం చోద్యం చేస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే మండిపడ్డారు. ఓ వైపు ఢిల్లీ తగలబడుతుంటే హోంమంత్రి అమిత్ షా ఆచూకీ లేదని తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

”ఢిల్లీలో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. కానీ అమిత్ షా ఎక్కడున్నారో తెలియడం లేదు. దీని గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. కానీ ఢిల్లీ అగ్నిగుండంలా మారితే అమిత్ షా ఎక్కడున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. అల్లర్లు జరుగుతున్న తరుణంలో అజిత్ దోవల్ రోడ్లపై కనిపించారు. ప్రజా సమూహాలతో మాట్లాడారు కూడా. మరి అమిత్ షా ఎక్కడా కనిపించలేదు. కానీ ఆయన ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం కనిపించారు” అని ఉద్దవ్ థాకరే అన్నారు.
కాగా, ఢిల్లీలో గడిచిన 36 గంటలుగా ఎలాంటి చేదు సంఘటనలు నమోదు కాలేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.