అమెరికాలో అమానుషం..ఎన్నారై దారుణ హత్య

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో ప్రవాస భారతీయుడు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని విట్టియార్‌ నగరంలోని సెవెన్‌-ఎలెవన్‌ నిత్యవసరాల దుకాణంలో మణిందర్‌సింగ్‌ సాహి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 5.43 గంటల ముసుగు ధరించిన ఆగంతకుడు తుపాకీతో దుకాణంలోకి ప్రవేశించాడు. కౌంటర్‌లోని డబ్బు ఇవ్వాలని మణిందర్‌ను బెదిరించడంతో.. ఆయన డబ్బు ఇచ్చేశాడు. అయితే పారిపోతూ మణిందర్‌పై కాల్పులకు తెగబడటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగులు దొంగతనం కోసమే వచ్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మృతుడు హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన వాడు. భార్య, ఇద్దరు పిల్లలున్న మణిందర్‌.. ఆరునెలల కిందటే అమెరికాకు వచ్చినట్టు తెలుస్తుంది.