మునుపెన్నడూ లేని విధంగా.. చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

వాస్తవం ప్రతినిధి: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పలు దేశాలకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజా లెక్కల ప్రకారం చైనాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 77,150 కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 79,000గా ఉంది. వేర్వేరు ఆసుపత్రుల నుంచి ఆదివారం సుమారు 1846 మంది పూర్తి ఆరోగ్యవంతులై విడుదలయ్యారని ఆరోగ్య కమిషన్‌ తెలిపింది.కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్లు దేశాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో మార్చి 5న జరగాల్సిన వార్షిక భేటీని వాయిదా వేసుకోవాలని చైనా పార్లమెంట్‌ నిర్ణయించింది. దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ వార్షిక భేటీ తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తారని ప్రభుత్వ రంగంలోని చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ తన వార్తా ప్రసారాలలో వెల్లడించింది. ఈ భేటీని ఎక్కువ జాప్యం చేయబోరని టీవీ స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వార్షిక భేటీని మార్చిలో నిర్వహించాలని 1995లో తీర్మానాన్ని ఆమోదించిన తరువాత వాయిదా పడటం ఇదే తొలిసారి. మరోవైపు చైనాలో ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులు పర్యటించారు. వ్యాధి ప్రాబల్యం ఉన్న పలు ఆస్పత్రుల్లో వీరు పర్యటించారు. కోవిడ్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆదివారానికి 2,592కు చేరుకుంది.