వాస్తవం ప్రతినిధి: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హార్వే వెయిన్‌స్టీన్‌ను లైంగిక వేధింపుల కేసులో న్యూయార్క్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఒకప్పుడు హాలీవుడ్‌లోని అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన వెయిన్‌స్టీన్, 2006లో మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. అలాగే 2013 లో ఔత్సాహిక నటి జెస్సికా మన్పై కూడా అత్యాచారం చేసినట్టు తేల్చింది. వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా నిరూపణ జరిగి ఉంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. తన పలుకుబడిని ఉపయోగించుకుని వెయిన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, పరస్పర అంగీకారం లేకుండా తాను ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని వైన్‌స్టీన్ చెబుతూ వచ్చారు. కోర్టులో విచారణ సందర్భంగా వెయిన్‌స్టీన్ చాలా ఆందోళనగా కనిపించాడు. వాకర్ సాయంతో అతను కోర్టు హౌజ్‌లోకి వచ్చాడు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అతన్ని జైలుకు తరలించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. మార్చి 11న శిక్షను ఖరారు చేసేంతవరకు అతన్ని రిమాండులోనే ఉంచాల్సిందిగా ఆదేశించింది. వెయిన్‌స్టీన్‌కు విధించే శిక్షను మార్చి 11న నిర్థరిస్తారు.