ఆసియా XI జట్టును ప్రకటించిన బంగ్లా బోర్డు.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!!

వాస్తవం ప్రతినిధి: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి వేడుకల సందర్భంగా బంగ్లాదేశ్ గడ్డపై మార్చి 18, 21న ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఆసియా ఎలెవన్‌ జట్టులో పాకిస్థాన్‌ మినహా మిగిలిన ఆసియా దేశాల క్రికెటర్లు ఆడతారు. మరోవైపు వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో మిగిలిన దేశాల క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు.మంగళవారం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఆసియా XI కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఆసియా XI జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు బీసీబీ చోటిచ్చింది. భారత్ నుంచి కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, పేసర్‌ మహ్మద్ షమీ, స్పిన్నర్‌ కుల్‌దీప్ యాదవ్‌, కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ లోకేష్ రాహుల్‌లకు బీసీబీ అవకాశం ఇచ్చింది. రాహుల్‌ కేవలం ఒక మ్యాచ్‌కే ఎంపిక చేయబడ్డాడు. అయితే కోహ్లీ ఎంపికపై కాస్త గందరగోళం నెలకొంది.ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య మొదటి మ్యాచ్ మార్చి 18న జరగనుంది. ఇక అదే రోజు దక్షిణాఫ్రికాతో భారత్ చివరి వన్డేలో తలపడనుంది. దీంతో ఆరుగురు భారతీయ ఆటగాళ్లు ఆసియా ఎలెవన్ జట్టులో ఎలా ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మార్చి 21న జరగనున్న రెండో మ్యాచ్‌కు ఆరుగురు ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక భారత్ నుంచి నలుగురు క్రికెటర్లని పంపుతారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో నిర్ణయించగా.. మరో ఇద్దరు అదనంగా చోటు దక్కించుకున్నారు.