బాంబ్ పేల్చిన ట్రంప్..అమల్లోకి కొత్త “గ్రీన్‌ కార్డ్‌” నిబంధన..!!

వాస్తవం ప్రతినిధి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస విధానాలను కఠినతరం చేసిన డొనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయాన్ని విదేశీయులపై అమలు పరచనున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో శాశ్వత నివాసం కోరుకుంటున్న విదేశీయులు ఫెడరల్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించకుండా నిషేధం విధించనుంది. అమెరికాలో ఫుడ్‌ స్టాంప్స్‌ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్‌కార్డ్‌ నిరాకరించేందుకు ఉద్దేశించిన నిబంధన సోమవారం నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధన హెచ్‌1 బీ వీసాపై అమెరికాలో ఉంటూ, గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల కోసం అందిస్తున్న తక్కువ ధరకు ఆహార స్టాంపులు, ఉచిత విద్య, హెల్త్ కేర్ స్కీమ్‌ వంటి వాటిని స్థానిక అమెరికన్ల కంటే వలసదారులే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం నష్టనివారణా చర్యలకు దిగింది. ఈ నిబంధనపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. దీంతో “అమెరికా సమాజంలోకి కొత్తగా వచ్చేవారు వాళ్ల కాళ్ల మీద నిలవడాల్సిందే అని అమెరికా తెలిపింది. కాగా తాజా నిబంధన ప్రకారం..అమెరికా కు వెళ్లాలంటే ఇకపై మీ కాళ్ల మీద మీరు నిలవడాల్సిందే. ఒక్కవేళ అమెరికా దేశానికి మీరు భారమయ్యేటట్లయితే అక్కడికి అస్సలు రానివ్వరు. గ్రీన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో వలస విధానాలను మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తుంది.