న్యూయార్క్ న్యాయమూర్తిగా తెలంగాణ ప్రవాస మహిళ

వాస్తవం ప్రతినిధి: భారత సంతతికి చెందిన మహిళకు అగ్రరాజ్యంలో కీలక పదవి దక్కనుంది. సరితా కోమటి రెడ్డి ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫార్ ఈస్ట్రన్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నామినేట్ చేసినట్టుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా న్యాయవ్యవస్థలోని వివిధ భాగాల్లో పనిచేసిన సరితా కోమటిరెడ్డి ప్రస్తుతం.. యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జనరల్‌ క్రైమ్స్‌ డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. గతంలో కూడా అదే కార్యాలయంలో… అంతర్జాతీయ నార్కోటిక్స్, మనీ లాండరింగ్‌.. కంప్యూటర్‌ హ్యాకింగ్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ సమన్వయకర్తగా పనిచేశారు. బీపీ డీప్ వాటర్ హరిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరపున పలు కేసుల్లో న్యాయవాదిగా సమర్థవంతంగా తన వాదనలు వినిపించారు.

అలాగే కెలాగ్‌ హన్సెన్‌ టాడ్‌ ఫిజెట్‌ అండ్‌ ఫ్రెడెరిక్‌ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు చేశారు. కాగా హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న సరితా కోమటిరెడ్డి.. హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం న్యాయశాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా పనిచేశారు. కొలంబియా లా స్కూల్‌, జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ లా స్కూల్‌లో విద్యార్థులకు న్యాయ పాఠాలు బోధించారు. సరితా తండ్రి కోమటిరెడ్డి హనుమంతరెడ్డి మిస్సోరి రాష్ట్రంలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి గీతారెడ్డి రూమాటలజిస్టుగా పనిచేస్తున్నారు. గీతారెడ్డి గతంలో అమెరికా తెలుగు సంఘం ఆటా ట్రస్టీగా పనిచేశారు.