కచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి.. లేకపోతే..??..”నో” వీసా..!!

వాస్తవం ప్రతినిధి: భారత దేశంతో పాటు ప్రపంచం లోని వివిధ దేశాలకు చెందిన నైపుణ్యమున్న వారిని ఆకర్షించేందుకుగాను బ్రిటన్‌ ప్రభుత్వం కొత్తగా పాయింట్స్‌ బేసిడ్‌ వీసా విధానానికి శ్రీకారం చుట్టింది. తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు బ్రిటన్‌ హౌంశాఖ మంత్రి ప్రీతి పటేల్‌ ప్రకటించారు. ఈ తాజా వీసా విధానం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ దేశ పౌరులు కోరుకుంటున్నట్లుగా, పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని ప్రారంభిస్తున్నాం అని ఈ సందర్భంగా ప్రీతి పటేల్‌ పేర్కొన్నారు.

కొత్త విధానం ప్రకారం విద్యార్హతలు, నైపుణ్యాలు వంటివాటిని లెక్కించి పాయింట్లు కేటాయిస్తారు. విదేశీయులు కచ్చితంగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. కంపెనీ నియామక పత్రం ఉండాలి. ఈ రెండింటికీ కలిపి 50 పాయింట్లు ఇస్తారు. విద్యార్హతలు, అదనపు నైపుణ్యాలు, జీతభత్యాలు, వృత్తి వంటివాటి ఆధారంగా అదనపు పాయింట్లు కేటాయిస్తారు. కనీసం 70 పాయింట్లు సాధించినవారికి మాత్రమే వీసా మంజూరు చేస్తారు. కనీస వార్షిక వేతనాన్ని 25,600 పౌండ్లుగా (రూ.23.75 లక్షలు) నిర్ధారించారు. గతంలో ఇది 30వేల పౌండ్లుగా (రూ.27.85 లక్షలు) ఉండేది.