నారా వారి బిడ్డా మజాకా.. టైం చూసి కొట్టాడుగా..!!

వాస్తవం ప్రతినిధి: ఏపిలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. టిడిపీ, వైసీపీ ల మధ్య మాటలు తూటాలుల పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్లుగా ఉంటుంది. ఒకరినొకరు తిట్టుకోవడంలో, ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపడంలో ఎవరు ఏ మాత్రం తగ్గడం లేదు. అదానీ కంపెనీ వ్యవహారంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీరుతోనే అదానీ వేరే రాష్ట్రానికి తరలి వెళ్లిపోయిందని టీడీపీ ఆరోపిస్తుంటే.. గత ప్రభుత్వం అదానీ కంపెనీ రూ.70వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందంటూ డప్పుకొట్టుకుంటున్నాయి అని..కానీ, ఆ ప్రచారంలో నిజం లేదని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అదానీకి ప్రత్యామ్నాయం మరో స్థలం కేటాయిస్తామని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాజాగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీని పై మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ గారు ఉత్తరాంధ్ర ద్రోహి అని స్వయంగా ఐటీ శాఖ మంత్రి ప్రకటించారని, ప్రభుత్వ చేతగాని తనం వల్ల అదానీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుండి తరలిపోయిందని , అయితే 9 నెలల్లో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేని వాళ్ళు, అదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రం వెళ్తోంది అని అనడం వారి చేతగాని తనాన్ని బయటపెట్టుకోవడమే అని నారా లోకేష్ ఘాటు విమర్శలు చేసారు.

“రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు కల్పించే అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసింది. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు” అని విమర్శించారు. “ఉన్న ఉద్యోగస్తులను తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణో, యువతకి కొత్త ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి వికేంద్రీకరణో ఆలోచించండి” అని లోకేశ్ ట్వీట్ చేశారు.