మధ్యాహ్నం వివాహం జరిగింది.. రాత్రికి పెళ్లికొడుకు చనిపోయాడు!

 వాస్తవం ప్రతినిది: మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తయింది. రాత్రికి పెళ్లికొడుకు చనిపోయాడు. అప్పటి వరకు పెళ్ళి సందడికి కేరాఫ్‌ అనిపించిన ఇంటిని విషాదం చుట్టుముట్టేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం మేరకు…నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ పట్టణంలో ఈ విషాద ఘటన జరిగిద్మి. మంగళి గణేష్‌ (25) అనే వరునికి నిన్న మధ్యాహ్నం పెళ్లయింది.

రాత్రికి సంప్రదాయంలో భాగంగా ‘బారాత్‌’ నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు పెళ్లికొడుకు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. కానీ డీజే సౌండ్‌ను అతని గుండె తట్టుకోలేకపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రాత్రి రెండు గంటల సమయంలో తుదిశ్వాస వదిలాడు. నూరేళ్లు తోడుంటానని బాసలు చేసి కాసేపటి క్రితమే తన మెడలో మూడు ముళ్లు వేసిన వ్యక్తి అంతలోనే అందని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ యువతి వేదన వర్ణనాతీతం.