ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ఆహ్వానం

వాస్తవం ప్రతినిది: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ నెల 16 న అనగా రేపు ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్‌ ఆహ్వానించింది. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్‌ ప్రిన్సిపల్స్‌, కరిక్యూలమ్‌ కో ఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆప్‌ ప్రభుత్వంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీరిదిద్దారు. విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు కేజ్రీవాల్‌. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇక కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడి ని కూడా ఆహ్వానించారు. ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఏడుగురు బిజెపి ఎంపి లు, ఎనిమిది మంది నూతన ఎమ్మెల్యేలను కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు అందినట్లు అధికారిక సమాచారం.