రెండో రోజు ఢిల్లి లో పర్యటిస్తున్న సీ ఎం జగన్..

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇవాళ రెండో రోజు దేశ రాజధాని ఢిల్లి లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జగన్‌ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో జగన్‌ భేటీ కానున్నారు. శాసన మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపుపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. నిన్న ఢిల్లి లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జగన్‌ సమావేశమైన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు చివరి నిమిషంలో ఖరారు అయ్యాయి. దీంతో ఆయన తిరిగి అమరావతి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన జగన్ ఆ తర్వాత అక్కడే బస చేశారు. కొందరు కేంద్ర మంత్రులకు ఆయన కలవాలని భావించగా.. ఎవరి అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ రావాలని భావించారు.

కాగా.. న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేషీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అమరావతి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు న్యాయ శాఖా రవిశంకర్ ప్రసాద్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఖరారైంది. మూడు రాజధానుల అంశంలో న్యాయరాజధాని హైకోర్టును కర్నూలుకు తరలించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. న్యాయశాఖ మంత్ర రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన అనంతరం నితిన్ గడ్కరీతో సహా పలువురు మంత్రులను కూడా జగన్ కలుస్తారని తెలుస్తోంది.