ఓట్ల కోసం కాదు..రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చా:పవన్‌ కల్యాణ్‌

వాస్తవం ప్రతినిది: ఓట్ల కోసం తాను రాలేదని. రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని. అయితే, అమరావతి రాజధాని అనే నిర్ణయాన్ని గత ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని అన్నారు. రాజధానిని కదిలిస్తామని చెప్పడం అవగాహనా రాహిత్యమని చెప్పారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు వైఎస్‌ఆర్‌సిపి కూడా అంగీకరించిందని పవన్ అన్నారు. ఇప్పడు రాజధానిని మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని బిజెపి పెద్దలు కూడా చెప్పారని అన్నారు. రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు. రాజధాని రైతులు, మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతులకు మద్దతుగా ర్యాలీలు చేద్దామని గతంలో అనుకున్నామని. అయితే ఢిల్లీ ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశామని.త్వరలోనే ర్యాలీలను నిర్వహిద్దామని చెప్పారు.