ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

వాస్తవం ప్రతినిది: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రసాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మొత్తం 905 సహకార సంఘాలకు 157 సంఘాలు ఏకగ్రీవం కాగా… 747 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలోని 6 వేల 248 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 12 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 14 వేల 529 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

747 మంది గెజిటెడ్‌ ఆఫీసర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తుండగా.. మరో 20 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం 2 గంటల నుంచి కౌటింగ్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తరువాత పాలకవర్గాల నియామకం చేపడతారు.