కేంద్రంతో దోస్తీ.. తేల్చేసిన బొత్స సత్యనారాయణ!

వాస్తవం ప్రతినిధి: వైఎస్సార్సీపీ కేంద్రంతో చేతులు కలుపుతుందని, త్వరలోనే కేంద్రంలో జగన్ భాగస్వామిగా మారతాడని ఆ నేపథ్యంలో తన సోదరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమనే పుకార్లు తాజాగా ఏపీ రాజకీయాలలో వస్తున్న నేపధ్యంలో ఈ వార్తలపై విశాఖపట్టణంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన గతంలో రాజధానిపై బాంబు పేల్చగా ఇప్పుడు ఈ అంశం పై కూడా బాంబు పేల్చడంతో హాట్ టాపిక్ గా మారాయి.

కేంద్రంలో చేరాలనే ప్రతిపాదన వస్తే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం అని బొత్స ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి గడ్డమైనా పట్టుకోడానికి తాము సిద్ధంగా ఉంటాం అని కూడా తెలపడంతో పుకార్ల కు బలం చేకూరింది. దీంతో పాటు కేంద్రం తో ఎందుకు ఘర్షణ పడాలని ప్రశ్నించారు. వీటిని గమనిస్తుంటే త్వరలోనే కేంద్రంలో వైఎస్సార్సీపీ చేరే అవకాశం ఉందని బలంగా తెలుస్తోంది.

జగన్ అత్యంత సన్నిహితుడుగా పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేయడంతో వాస్తవమే అయ్యిండొచ్చు. ఎందుకంటే గతంలో రాజధాని మార్పు విషయంలో బొత్స ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వెంటనే కొన్నాళ్లకు ఆయన చెప్పిందే నిజమైంది. రాజధానిని మార్చేశారు. ఇప్పుడు కేంద్రంలో చేరే విషయం కూడా మాట్లాడడంతో వైఎస్సార్సీపీ బీజేపీతో దోస్తీ చేసే అవకాశం కనిపిస్తోందనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.