తన సొంత గృహాన్ని కంచి పీఠానికి అప్పగించిన ఎస్పిబి

వాస్తవం సినిమా: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన సొంత గృహాన్ని దానం చేశారు. తన స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న ఇంటిని కంచి పీఠానికి దానం చేశారు. ఈ ఇంటిలో బాలు తండ్రి ఎస్పీ సాంబమూర్తి పేరుతో వేద పాఠశాలను నిర్వహించనున్నారు.

ఆ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలు స్వయంగా కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి ఇంటిని అప్పగించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ..’మా నాన్న గారు పెద్ద శైవభక్తులు. గురుభక్తితో ఉండే వారు. వారులేరనే అసంతృప్తి తప్ప వారిపేరుతో వేద పాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తాం. కంచి పీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదు.. భగవత్‌ సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబు’ అని అన్నారు. కాగా, వేద పాఠశాల నిర్వహణకు తన సొంత ఇంటిని దానం చేసిన బాలుపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల కురిపిస్తున్నారు.