షేక్ చేస్తున్న కరోనా..షాకిస్తున్న బంగారం ..!!

వాస్తవం ప్రతినిధి: గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. కరోనా వైరస్ భయాలు బంగారానికి కలిసొచ్చాయి. కరోనా వైరస్ వలన మరణాలు పెరగడంతో చాలామంది తమ డబ్బును బంగారంలో పెట్టుబడిగా పెడుతున్నారు. అదే విధంగా అంతర్జాతీయంగా కూడా బంగారానికి కొంతమేర పెరగడంతో పసిడితో పాటు వెండి ధర కూడా పైపైకి పెరిగింది. ఈ ఎఫెక్ట్ భారత్ మార్కెట్‌పై కూడా పడింది. రూపాయి కూడా బలహీనపడటంతో పసిడి పరుగు ఊపందుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర పైకి కదలడంతో పసిడి 10 గ్రాముల ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.38వేల 640 నుంచి రూ.38,880కు ఎగబాకింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 41వేల 835 నుంచి రూ. 42వేల 85కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,880కు చేరింది. వెండి ధర రూ.49,000కు పెరిగింది.