నెల్లూరు లో వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి నిప్పు పెట్టిన దుండగులు

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. బోగోలు మండలం బిట్రగుంట కొండపై ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో రథం పూర్తిగా దగ్ధమైంది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సిద్ధమౌతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో మార్చి 4 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. పూర్వ కాలం నుంచి ఇదే రథాన్ని ఊరేగింపు కోసం వాడుతున్నారు. ఈ తరుణంలో షెడ్డులో ఉన్న రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.