చేతులు జోడించి అభ్యర్థిస్తున్న..దయ చేసి మీ డబ్బులు తీసుకోండి..!!

వాస్తవం ప్రతినిధి: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వెస్ట్‌మినిస్టర్ కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరయ్యారు. అయితే తనకు ఇచ్చిన అసలు డబ్బులో వందశాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరారు. ఈ విషయంలో చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నాడు. తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు. అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆస్తులపై ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయని మాల్యా ఆరోపించారు. కాగా, బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా 2016లో లండన్‌కు పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనను తమకు అప్పగించాలని యూకేను కోరుతూనే ఉంది. మూడో రోజు విచారణకు హాజరైన సందర్భంలో కోర్టు బయట మాల్యా మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం అయ్యాయి.