‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన నార్త్ కొరియా

వాస్తవం ప్రతినిధి: ఉత్తరకొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో, అక్కడ పాలన ఎంత నిరంకుశంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 (కరోనా వైరస్) విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు నార్త్ కొరియాలో మానవత్వం అనేది ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.కొవిడ్‌-19(కరోనా కొత్త పేరు) వైరస్‌ అనుమానంతో ఓ వాణిజ్య అధికారిని నిర్బంధించారు. అయితే, నిబంధనలు ఉల్లంఘించి అతడు బయటకు వచ్చాడని అక్కడికక్కడే కాల్చిపారేశారట.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియాకు చెందిన ఓ అధికారి చైనా టూర్‌ ముగించుకుని నార్త్ కొరియాకు చేరుకున్నాడు. అయితే చైనా టూర్ నుంచి వచ్చాక అతనికి కరోనా వచ్చిందన్న అనుమానంతో అతడిని బయటికి రావొద్దని కఠిన నిబంధనలు పెట్టారు. అంతేకాదు అతనిపై ప్రత్యేక టీం నిఘా కూడా పెట్టింది. అయితే సదరు వ్యక్తి ఆ నిబంధనలు ఉల్లంఘించి ఓ పబ్లిక్ టాయిలెట్ దగ్గర తిరుగుతూ కనిపించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా సదరు వాణిజ్య అధికారి నిబంధనలు ఉల్లంఘించినందున అతడిని చంపినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. చైనా సరిహద్దులను పూర్తిగా మూసేసింది. ఎవరైనా చైనాకు వెళ్లడానికి ప్రయత్నిస్తే.. వారకి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.