జట్టులో వారు లేకపోవడం పెద్ద లోటు: రవిశాస్త్రి

వాస్తవం ప్రతినిధి: యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన ఆటగాడు. గత రెండేళ్లగా అతడి ఆటతీరుని పరిశీలిస్తున్నా. గిల్‌కు ఎంతో ప్రతిభ ఉంది. తొలి టెస్టులో అతడు ఉన్నా లేకపోయినా జట్టుతోనే ఉంటాడు అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. అయిదుగురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జట్టులో వారు లేకపోవడం పెద్ద లోటు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి భారత జట్టుతో కలిసి హామిల్టన్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘న్యూజిలాండ్‌ సిరీస్‌కు దాదాపు అయిదుగురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వారు లేకపోవడం పెద్ద లోటు. జట్టుకు, వారికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. న్యూజిలాండ్‌లో భువనేశ్వర్‌ కుమార్ అన్ని ఫార్మాట్లలో ఎంతో ఉపయోగపడతాడు. ఇక టెస్టుల్లో ఇషాంత్‌ శర్మ కీలక పాత్ర పోషిస్తూ జట్టుకు సానుకూలాంశంగా ఉంటాడు. కానీ.. గాయాలు ఆటగాళ్లను జట్టు నుంచి దూరం చేశాయి’ అని అన్నాడు.