గుడిసెలు కనిపించకుండా గోడ కడితే..ట్రంప్ కు తెలియదా ఏంటి..?

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24.. 25 తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 24న ఢిల్లీకి వచ్చిన ఆయన తర్వాత అహ్మదాబాద్ కు రానున్నారు.

ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటన కోం గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లలో మునిగిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి ఆయన పాల్గొనాల్సిన వేదిక వద్దకు వెళ్లే మార్గంలో ఉన్న ఒక మురికివాడ కనిపించకుండా ఉండేందుకు ఐదారు అడుగుల ఎత్తులో గోడ కట్టిస్తున్న వైనం అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చగా మారింది. వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 24న ట్రంప్ గుజరాత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గాంధీనగర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. గాంధీనగర్‌కు వెళ్లే మార్గంలో దేవ్‌శరణ్ అనే మురికివాడ ఉంది. ఇక్కడ 500లకు పైగా గుడిసెల్లో 2,500 మంది నివసిస్తున్నారు. ఈ గుడిసెలు ట్రంప్‌కు కన్పించకుండా ఉండేందుకు రహదారి పొడవున దాదాపు అర కిలోమీటరు మేర 6 నుంచి 7 అడుగుల ఎత్తులో గోడ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత రహదారి వెంబడి మొక్కలు నాటుతామని సమాచారం. వీటన్నింటి కోసం దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై సోషల్ మీడియాలో విమర్సలు వెల్లువెత్తుతున్నాయి.మోడీ సాబ్.. మనం గోడ కట్టించినంత మాత్రాన.. కారులో వెళ్లే ట్రంప్ అద్భుతంగా ఉందని అనుకోరుకదా? ఆ మాటకు వస్తే.. ట్రంప్ వారి పర్యటన సందర్భంగా చేసిన మార్పులు.. చేపట్టిన నిర్మాణాలు.. చేసిన ఖర్చు లెక్కలు లాంటివి అమెరికా నిఘా వ్యవస్థ సేకరించి.. వాటికి సంబంధించిన నోట్ ను అధ్యక్షుల వారికి నాలుగు లైన్లలో వివరించకుండా ఉంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.