తన వైవాహిక జీవితంపై మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సంచలన నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. మైకెల్ క్లార్క్ తన భార్య కైలీతో త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్టుగా బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. కొంతకాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని క్లార్క్‌, కైలీ దంపతులు వెల్లడించారు. కూతురు 4వ పుట్టినరోజు వేడుకలు, క్లార్క్ తల్లిదండ్రుల 50వ పెళ్లిరోజు వేడుకలలో క్లార్క్‌, కైలీ దంపతులు సఖ్యతగానే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. ఇంతలోనే ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ తమ కుమార్తెను ఇద్దరం చూసుకోవడానికి కట్టుబడి ఈ నిర్ణయానికి వచ్చామని క్లార్క్‌ దంపతులు పేర్కొన్నారు. తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేశారు.