దేనికీ భయపడను…ప్రత్యర్థి ఓటమే నా లక్ష్యం: రితు ఫోగట్

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19( కరోనా వైరస్)కు తానేమి భయపడనని మిక్స్‌డ్ మార్షల్ ఆర్డ్స్ (ఎంఎంఏ) ఫైటర్ రితు ఫోగట్ తెలిపింది. ప్రత్యర్థి ఓడించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఆమె రెజ్లింగ్ నుంచి ఎంఎంఏకు మారిన విషయం తెలిసిందే. తన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ తొలి ఫ్రొఫెషనల్ ఫైట్‌లోనే విజయం సాధించింది. గతేడాది నవంబర్‌లో బీజింగ్ వేదికగా జరిగిన వన్ చాంపియన్‌షిప్ ఏజ్ ఆఫ్ డ్రాగన్స్‌లో రితు సౌత్ కొరియా ప్లేయర్ నామ్ హీ కిమ్‌ను మట్టికరిపించింది.

తన రెండో ఎంఎంఏ పోరు కోసం రితు సింగపూర్‌ వెళ్లాల్సి ఉంది. అక్కడ జరిగే ‘వన్‌ ఛాంపియన్‌షిప్‌: కింగ్‌ ఆఫ్ ది జంగిల్‌’ పోరులో చైనా క్రీడాకారిణి వు చియావో చెన్‌తో తలపడాల్సి ఉంది. ఫిబ్రవరి 28న ఈ బౌట్‌ జరుగనుంది. అయితే చైనా, సింగపూర్‌, థాయ్‌ల్యాండ్‌, జపాన్‌ సహా తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్‌ (కరోన వైరస్‌) పేరు చెబితేనే వణుకుతున్నారు. చైనాకు పొరుగునే ఉన్న భారత్‌లోనూ కొంత ఆందోళన కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా దేశాలకు వెళ్లేందుకు చాలా మంది వెనకాడుతున్నారు.సింగపూర్‌లోను ఇప్పటికే 50 మందికి కొవిడ్‌ ఉన్నట్టు తేలింది. అయినా తగిన జాగ్రత్తలు పాటిస్తూ సింగపూర్‌ వెళ్తానని రితు తెలిపింది. ‘నేను సింగపూర్‌లో ఉంటూనే ప్రతిరోజూ సాధన చేస్తాను. అక్కడికెళ్లి ఆడేందుకు వెనుకాడను. నేనుండే చోటు నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటా. మాస్క్‌ ధరిస్తా. మాంసాహారం తీసుకోను. బయట ఆహారం తినను. ఇంట్లోనే వండుకొని తింటాను. సబ్జీ రోటీని నేను చేసుకోగలను’ అని రితు చెప్పుకొచ్చింది.