యూఏఈలో భారతీయుడికి కరోనా

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వెయ్యిమందికి పైగా మరణించారు.  వేలాది మంది ఈ వైరస్ ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  కాగా, దాదాపుగా 25 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది.  అందులో యూఏఈ కూడా ఒకటి. తాజాగా యూఏఈలో ఓ ప్రవాస భారతీయుడికి కరోనా నిర్థారణ అయ్యింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8కి చేరింది. కరోనా లక్షణాలున్న వ్యక్తితో మాట్లాడిన తర్వాత భారతీయుడికి వ్యాధి సోకినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ శాఖ సోమవారం ప్రకటించింది. వైరస్ సోకిన వ్యక్తులను సపరేట్ గా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ‌దుబాయ్‌లో సెలవు దినాలను గడిపేందుకు వుహాన్ నుంచి వచ్చిన నలుగురు చైనీయులుకి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో దుబాయ్ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. కాగా ఈ ఎనిమిది మందిలో ఒకరు భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో ఇండియా ఆందోళన చెందుతున్నది. కాగా, ఇండియాలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మూడు కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం.