ఢిల్లీ లో విషాద ఘటన!

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ షాలిమార్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను హతమార్చిన తర్వాత ఓ తండ్రి మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. డిప్రెషన్‌ కారణంగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాల ప్రకారం..

సాండ్‌పేపర్‌ ఫ్యాక్టరీ నెలకొల్పి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న 44 ఏళ్ల బిజినెస్ మ్యాన్ మాధుర్‌ మలానీ భార్య రూపాలి, 14 ఏళ్ల కూతురు సమీక్ష, ఆరేళ్ల కొడుకు శ్రేయాన్స్‌ తో కలిసి ఢిల్లీలోని షాలిమార్‌ భాగ్‌లో నివసిస్తున్నాడు. వ్యాపారంలో ఉన్న మాధుర్‌ను నష్టాలు వెంటాడాయి. దీంతో ఆరు నెలల క్రితం ఫ్యాక్టరీని మూసివేసి అతడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఆనాటి నుంచి మాధుర్‌ తల్లిదండ్రులే అతడి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ఓ వైపు ఫ్యాక్టరీ మూతపడటం మరోవైపు ఉద్యోగం లేకుండా ఇంటిపట్టునే ఉండటంతో మాధుర్‌ మానసికంగా కుంగిపోయాడు.

ఆదివారం మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన భార్య రూపాలికి పిల్లలు సమీక్ష, శ్రేయాన్స్‌ విగతజీవులుగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. భర్త జాడ కూడా తెలియరాకపోవడంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. మాధుర్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మాధుర్‌ కోసం గాలిస్తుండగా నిన్న రాత్రి హైదీర్‌పూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఓ వ్యక్తి శవం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని మాధుర్‌గా గుర్తించారు. అతడు మెట్రో స్టేషను మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది.మాధుర్ ఆత్మహత్య, చిన్నారుల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. భర్త, ఇద్దరు పిల్లలు శాశ్వతంగా దూరం కావడంతో భార్య రూపాలి, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.