కొత్త వీసా విధానం ప్రవేశపెట్టిన బ్రిటన్‌

వాస్తవం ప్రతినిధి: ఐరోపా యూనియన్‌ నుంచి తప్పుకొన్నాక వృత్తి నిపుణుల వీసాల జారీలో బ్రిటన్‌ పలుమార్పులు చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌ తన వలస నిబంధనల్లో భారీ మార్పులు చేపడుతోంది. బ్రెగ్జిట్‌ అనంతరం వీసాలు, వలసల విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆ దేశ పార్లమెంటులో హోంశాఖ మంత్రి సాజిద్‌ జావీద్‌ ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా తగిన ప్రతిభా సంపత్తి ఉన్నట్టయితే బ్రిటన్‌లో పని చేసేందుకు వీలవుతుంది. విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం పనిచేసుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ విధానం బ్రెగ్జిట్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత దశలవారీగా అమలవుతుంది. ఇప్పటికే కసరత్తు పూర్తయిన కొత్త విధానంలో 30వేల పౌండ్ల(రూ.27.66 లక్షలు) వార్షికాదాయం నిబంధనను 25,600(రూ.23.60 లక్షలు) పౌండ్లకు తగ్గించింది.