అయ్యో….ఒక చీర కారణంగా పెళ్ళి ఆగిపోయిందట !

వాస్తవం ప్రతినిధి: వారిద్దరి మనసులూ కలిసాయి. ప్రేమించుకొన్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యారు. వివాహానికి కొన్ని గంటల ముందు ఓ చిన్న కారణంతో.. జరగాల్సిన పెళ్లి కాస్తా కాన్సెల్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేసేదాక వెళ్ళింది. కర్నాటకలోని హసన్ తాలుకా పరిధిలోని బీదర్ కేర్ గ్రామంలో ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే..

బీదర్ కేర్ కు చెందిన బీఎన్ రఘుకుమార్ అదే గ్రామానికి చెందిన సంగీతను ప్రేమించాడు. తామిద్దరం ఇష్టపడ్డామని పెళ్లి చేయమని ఇద్దరూ వారి కుటుంబ సభ్యులకు తెలపగా వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారు. అన్ని కుదిరాయి. పెళ్లికి ముహూర్తం ఫిబ్రవరి 7గా నిర్ణయించారు. పెళ్లి బట్టలు కొన్నారు.. అన్ని పనులు పూర్తయ్యాయి. పెళ్లికి ముందురోజు అంటే 5వ తేదీన పెళ్లికూతురు వధువు తరఫు వారి మధ్య చీర విషయం లో వాగ్వాదం ఏర్పడింది. వధువు చీర బాగోలేదని.. నాసిరకంగా ఉందని పెళ్లికొడుకు రఘుకుమార్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ చీర వద్దు.. మరో చీర మార్చుకోవాలని (కొనుక్కోవాలని) తెలపడంతో వధువు వినలేదు. లేదు నాకు ఈ చీరే నచ్చిందని ఇదే ధరిస్తానని చెప్పడంతో వరుడి కుటుంబ సభ్యులకు కోపమొచ్చింది. చీర మార్చుకోకపోతే పెళ్లి జరగదు రఘుకుమార్ తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. చీర మార్చుకోమంటే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నామంటూ పెళ్లి కొడుకు.. ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సంగీత పై అరిచాడు.

ఈ గొడవ చినికిచినికి వానగా మారి చివరకు పెళ్లి ఆగేలా చేసింది. దీంతో తరువాత ఎవరికీ తెలియకుండా వరుడు రఘుకుమార్ పారిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తీరా పెళ్లి జరగబోయే సమయంలో రఘుకుమార్ పరారవడంతో రఘుకుమార్ కుటుంబంపై వధువు కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరువు తీయటానికి ఉద్దేశ పూర్వకంగానే ఈ పెళ్లిని రఘుకుమార్ తల్లిదండ్రులు ఆపారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు.