న్యూజిలాండ్ ఆటగాళ్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ

వాస్తవం ప్రతినిధి: అద్భుతమైన ఆటతో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. వన్డే సిరీస్‌లో మాత్రం వరుస పరాజయాలతో తలవంచింది. శనివారం జరిగిన రెండో వన్డేలోనూ ఓడి ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను సమర్పించుకుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీస్తే.. కివీస్‌ జట్టు ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో విజయాలు సాధించి ప్రతీకారం తీర్చుకుంది.

అయితే ఈ విజయానందంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. రెండో వన్డే మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించింది . స్లో ఓవర్ రేట్ కారణంగా కివీస్ ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఈ కోత విధించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్ణీత సమయం కన్నా మూడు ఓవర్ల పాటు ఆలస్యంగా వేయడంతో ఐసీసీ నిబంధనల మేరకు ప్రతీ ఓవర్‌కు 20 శాతం చొప్పున కోత విధించింది. తాత్కలిక కెప్టెన్ టామ్ లాథమ్ ఈ శిక్షను అంగీకరించడంతో తదుపరి వాదోవాదాలు వినాల్సిన అవసరం లేదని ఐసీసీ పేర్కొంది.