కొంప ముంచిన కరోనా..చైనా పై నిషేధం..!

వాస్తవం ప్రతినిధి: చైనాలో పుట్టిన కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈనేపథ్యంలో చైనా, మయన్మార్ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆహారం, ఇతర ఉత్పత్తుల దిగుమతులపై మణిపూర్‌, మిజోరం రాష్ట్రాలు నిషేధం విధించాయి. నిబంధనల ప్రకారం ప్యాక్‌ చేయని, లేబుల్స్‌ లేని ఆహార పదార్థాలు… ఇతర అన్ని ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక నిషేధాన్ని విధించినట్టు ఆ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. మణిపూర్‌ సరిహద్దుల వెంబడి ఉన్న మార్కెట్లలో చైనాకు చెందిన ఆహార పదార్థాలతో పాటు సెకెండ్‌ హ్యాండ్‌ వస్త్రాలు వంటి ఉత్పత్తులను కొనవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిషేధం రేపటి నుంచే అమల్లోకి రాబోతోంది. అంతేకాదు చైనా, మయన్మార్ సరిహద్దుల్లో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా నుంచి మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. వీరిని ఇంట్లోనే ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 722 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మొత్తం కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 34,546కు చేరింది. 3,399 మందికి కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు నిర్ధారించినట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.