అందరి ఊహలను తలకిందులు చేస్తూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ వికేంద్రీకరణ బిల్లుకి అడ్డుపడుతుంది అన్న కోపం తో ఏపీ సీఎం జగన్ శాసనమండలి రద్దు చేయాలనీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి ..మండలి రద్దు పై అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తుంటే ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు అంటూ మండలి రద్దుని తెరపైకి తీసుకురావడం తో పెద్ద దుమారమే రేగింది. అయితే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది అని, దీనిపై అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు అంటూ ప్రతి ఒక్కరూ కూడా భావించారు. అయితే అందరి ఊహలను తలకిందులు చేస్తూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మండలి రద్దు వ్యవహారం పై మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని ఈ అంశం పై రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని – ఆలస్యం చేయడం తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండవంటూ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 169(1) ప్రకారం అసెంబ్లీ తీర్మానాన్ని చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప తాము చేసేదేమీ ఉండబోదని ఆయన తెలిపారు.