ఆస్ట్రేలియా స్ట్రాత్‌ఫీల్డ్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సంధ్యారెడ్డి

వాస్తవం ప్రతినిధి: విదేశాలలో ఉంటున్న ఎంతో మంది భారతీయులు తమ ప్రతిభతో ఇండియాకి ఎంతో గుర్తింపు తీసుకువస్తున్నారు. విదేశాలలో ఉన్నత ఉద్యోగాలలో మాత్రమే కాకుండా సేవా, పర్యావరణ పరిరక్షణలో సైతం భారతీయులు తమ విశ్వాసాన్ని చూపిస్తున్నారు. తాజాగా భారతసంతతికి చెందిన సంధ్యారెడ్డికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక ‘స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2020’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ గా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. సమాజసేవతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేసేవారిని స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశంలోకి వచ్చే కొత్తవారికి సాయం చేయడం, వారికి సలహాలు సూచనలు ఇవ్వడం, పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చూడటంలో సంధ్యారెడ్డి సహకారం అందించారు. స్ట్రాత్‌ ఫీల్డ్‌ ప్రాంతంలో అత్యవసర సేవలందించడంలో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సేవలకుగాను సంధ్యారెడ్డిని అవార్డు వరించింది.