‘కాల్‌ సెంటర్‌ కుంభకోణం’లో ముగ్గురు భారతీయులకు జైలుశిక్ష

వాస్తవం ప్రతినిధి: ‘కాల్‌ సెంటర్‌’ మోసానికి సంబంధించి అమెరికాలో ముగ్గురు భారతీయులు సహా ఎనిమిది మందికి సోమవారం స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. సోమవారం కేసు విచారణ సందర్భంగా అమెరికా అటార్నీ బైయూంగ్‌ జే వాదనలు వినిపిస్తూ భారత్‌ కేంద్రంగా నడిచిన ఈ కాల్‌ సెంటర్‌ కుంభకోణం వల్ల తమ దేశ పౌరులకు 3.7 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.26.37 కోట్లు) నష్టం వాటిల్లిందని తెలిపారు. జార్జియా రాష్ట్రంలో నివసించే మొహమ్మద్‌ కాజిమ్‌ మొమిన్, మొహమ్మద్‌ సోజబ్‌ మొమిన్, పాలక్‌కుమార్‌ పటేల్‌లకు కోర్టు ఆర్నెల్ల నుంచి నాలుగేళ్ల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్ష విధించింది. భారత్‌లోని సహ కుట్రదారులతో కలిసి, అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్లు కేంద్రంగా ఈ మోసానికి వారు పాల్పడ్డారని కోర్టు తేల్చింది. డాటా బ్రోకర్ల నుంచి పలువురు అమెరికన్ల సమాచారాన్ని సేకరిం చారు. ఆయా వ్యక్తులకు ఫోన్లు చేసి తాము ‘ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌’ అధికారులమని చెప్పేవారు. ‘పన్నులు చెల్లించకుంటే జైలుకు పంపిస్తాం’ అంటూ బెదిరించి, డబ్బు వసూలు చేసేవారు. ఇలా వేలమంది అమెరికన్లను మోసం చేశారు.