మూడు రాజధానుల అంశం విఫలమౌతుంది : గల్లా

వాస్తవం ప్రతినిధి: మూడు రాజధానుల విషయం పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి స్పందించారు. కేవలం ఒక్క సౌత్ ఆఫ్రికా లో మాత్రం ఇలా మూడు రాజధానులు అనేవి కల్పించారని, అయితే అక్కడకూడా ఈ ప్రయోగం విఫలమైంది అని సౌత్ ఆఫ్రికా ప్రతినిధులే చెబుతున్నారు అని గల్లా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని, ఐఐటీ చెన్నై వాళ్లు చెప్పారంటూ కొన్ని అవాస్తవాలు చెప్పారని గల్లా ఆరోపించారు. అసలు ఈ విషయంలో రైతుల అభిప్రాయాలు ఎందుకు తేసుకోలేదంటూ కోర్టు లు ప్రశ్నిస్తున్నాయి అని గల్లా వ్యాఖ్యానించారు. తమ గోడు చెప్పుకోడానికి వస్తున్న రైతులను, ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారని, పోలీసులపై రాళ్లు వేశామంటూ తమపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారని, వారు గోళ్ల తో రక్కి నన్ను గాయపరిచారు అంటూ గల్లా తెలిపారు. రాళ్లు వేశానని తనపై కేసులు పెట్టారని, తనను రక్షించేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలు కూడా గాయపడ్డారన్నారు. తనను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. తీవ్రవాదులు, నక్సలైట్లపై పెట్టే సెక్షన్లు రైతులపై పెడుతున్నారని, పోలీసులు వైఖరిపై ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని జయదేవ్‌ అన్నారు. ఇప్పటికే చాలా భాగం రాజధాని కోసం అమరావతి లో అన్ని డెవలప్ చేశామని,ఇంకా రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే అమరావతి లో అన్నీ పూర్తి అవుతాయని తెలిపారు.