కౌంటర్ ట్వీట్ తో విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చిన బుద్దా

వాస్తవం ప్రతినిధి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై చేసిన విమర్శల కు కౌంటర్ ట్వీట్ తో సమాధానం చెప్పారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఏపీ శాసన మండలి రద్దు అంశం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి కాలభైరవ యాగాల తర్వాత క్షుద్ర‌ పూజలే మిగిలాయి. అవి కూడా కానిచ్చి ఫలితం కోసం నిరీక్షించండి. కౌన్సిల్ రద్దు బిల్లును పార్లమెంటు తిరస్కరిస్తుందని కలలు కనొచ్చు. రాజధాని భూముల కోసం మీరు ప్రదర్శిస్తున్న నాటకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇంకోసారి వాతలు తప్పవు అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. క్షుద్ర పూజలకు బ్రాండ్ అంబాసిడర్ విజయసాయిరెడ్డేనని అన్నారు. జగన్ సీఎం కావాలని క్షుద్రపూజలు చేయించావు ఇప్పుడు తుగ్లక్ మూడు ముక్కలాట గట్టు ఎక్కాలని కాళహస్తి దేవాలయంలో క్షుద్ర పూజలు చేయించారు.. ఇన్ని చేయించినా మీ చెత్త నిర్ణయాలకు దైవం అడ్డుపడింది అంటూ బుద్ధా కౌంటర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా జగన్‌కు జనం ఇచ్చిన ఛాన్స్ ఇదే చివరిది అని కూడా ప్రజలు అంటున్నారు అని వెంకన్న ట్వీట్ లో పేర్కొన్నారు.