కశ్మీర్ అంశంపై నేపాల్ మధ్యవర్తిత్వం

వాస్తవం ప్రతినిధి: జమ్ముకశ్మీర్‌ అంశానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని భారత్‌ వాదిస్తున్న వేళ పొరుగు దేశం నేపాల్‌ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. దాయాది దేశాల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలను చర్చల ద్వారానే తొలగించుకోవాలని ఓ నేపాల్ అధికారి వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజమే అన్న నేపాల్‌… చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడింది. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం చేస్తామని నేపాల్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఇలా ప్రతిపాదన తెస్తూనే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలే ఉత్తమం అని కూడా నేపాల్‌ వ్యాఖ్యానించింది. భారత్-పాక్‌ల మధ్య పరిస్థితులు చక్కబడితే, దక్షిణాసియా దేశాల సార్క్ కూటమి కూడా పునరుత్తేజితమవుతుందని ఆయన తెలిపారు. అయితే గతంలో మధ్యవర్తిత్వంపై ప్రతిపాదన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నాడు ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని సమాధానమిచ్చింది భారత్.కాగా ఇప్పుడు ఇదే అంశం పై నేపాల్ చేసిన ప్రకటన సై భారత్ ఇంకా స్పందించలేదు.