ఇకపై వారికి అమెరికాలో అడుగు పెట్టడం గగనమేనా..??

వాస్తవం ప్రతినిధి : అమెరికా పౌరసత్వం పొందటమంటే అంత సులువు కాదు. చాలా మంది ప్రవాసులు ఎన్నో ఏళ్ళుగా హెచ్-1 బీ వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించి, అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపేస్తూ ఉంటారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అసలు గ్రీన్ కార్డ్ వస్తుందనే ఆశలు కలలు గానే మిగిలిపోయాయి. ఇప్పటికే పలు ఆంక్షల పేరుతో అమెరికా వచ్చే వారికి ఝలక్ ఇస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులపై దృష్టిసారించింది. గర్భిణుల ఆశలపై నీళ్లు చల్లేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేకంగా కొత్త వీసా నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. అమెరికాలో జన్మనివ్వడం ద్వారా తమ పిల్లలకు ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్‌ సర్కార్‌ ఆంక్షలు విధించనుంది. ప్రసవం కోసం అమెరికాకు వచ్చే మహిళలను ఇతర విదేశీయులుగానే పరిగణించనుంది. అమెరికా నిభందనల ప్రకారం ఏ దేశపు గర్భిణి అయినా సరే తాను ప్రసవించే సమయంలో గనుకా అమెరికాలో ఉంటే పుట్టిన బిడ్డకి అమెరికా పౌరసత్వం అక్కడి హక్కుల ప్రకారం వస్తుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది గర్భిణులు టూరిస్ట్ వీసాతో వెళ్ళడం అక్కడ ప్రసవించడం దాంతో వారి బిడ్డలకి అమెరికా పౌరసత్వాన్ని పొందటం జరుగుతోంది. ఈ పరిస్థితులని గమనించిన ట్రంప్ సర్కార్ వాటిని అరికట్టేందుకే కొత్త వీసా విధానాన్ని అందుబాటులోకి తీసుకొరాన్నుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. గర్భిణులు తమ టూరిస్ట్‌ వీసాపై అమెరికాకు వెళ్లడం మరింత కష్టమవుతుంది. అయితే ఈ నిబంధనలు అమలు చేయడం ట్రంప్‌ ప్రభుత్వానికి అంత సులభం కాదని నిపుణులు, ట్రంప్‌ ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు చెబుతున్నారు.