కని విని ఎరుగని రీతిలో “టాగ్స్” 16వ వార్షికోత్సవ మరియు సంక్రాంతి సంబరాలు!

వాస్తవం ప్రతినిధి : కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 16 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలను ఎంతో ఆనందోత్సాహాలతో అట్టహాసంగా జరుపుకున్నారు. శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 16వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు శనివారం జనవరి 18వ తేది 2020 ఫాల్సం హైస్కూల్‌లో నిర్వహించారు. మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా టాగ్స్ ప్రత్యేకంగా రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా గా ఆకట్టుకొన్నాయి. రంగవల్లులు, జట్కాబండి, పాలవెల్లి, గాలిపటాలతో వేడుకల వేదికను సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. 400 కు పైగా ఉన్న కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొంది.

సంక్రాంతి వేడుకల సందర్భంగా టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు తో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నోవిశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఫాల్సం మేయర్ సారా అక్వినో, కాలిఫోర్నియా శాసనసభ సభ్యుడు కెవిన్ కైలీ, కాలిఫోర్నియా రాష్ట్ర ముఖ్య సమాచార అధికారి ఏమీ టోంగ్, రాక్లిన్ నగర కౌన్సిల్ సభ్యుడు బిల్ హలిడిన్ లు ప్రియమైన అతిధులుగా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియూ శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల, ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ, సమాచార అధికారి రాఘవ చివుకుల నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. కాలిఫోర్నియా సెనెటర్ షానన్ గ్రోవ్ ఈ సందర్భంగా సంక్రాంతి సందేశాన్ని వీడియో ద్వారా టాగ్స్ సభ్యులకు పంపించారు.

టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, నాటోమాస్, ఎల్ డోరాడొ, మరియూ రాంచో కార్డోవా సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. సిలికానాంధ్ర మనబడి అధ్యక్షుడు రాజు చామర్తి ప్రియమైన అతిధి గా టాగ్స్ సత్కారాన్ని అందుకొన్నారు. మనదైన భాషను తరువాతి తరాలకు అందజేయడానికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న ప్రయత్నంలో అందరూ తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేసారు. వేదికపై బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం తదితర పోటీలలో గెలుపొందిన విజేతలకు టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు జ్ఞాపికలు అందజేసారు. తరువాత స్థానిక రోజ్ విల్ నగరంలో ఉన్న “అక్షర మన సంస్కృతి” సంస్థ సహకారంతో నడుస్తున్న తెలుగు బడి పిల్లలు వేదికపై పాడిన తెలుగు పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారం జనవరి 11న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ఫ్రీమాంట్ నగర దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు భోగిపళ్లు కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన పెద్దలు అందరూ ఆశీర్వదించారు. కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతంకు అహర్నిశలు కృషి చేసిన వారిలో టాగ్స్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు.

ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు “భారత్ లో ఉన్న అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం శాక్రమెంటో కేంద్రంగా పనిచేస్తున్న హోప్ అబైడ్స్ సంస్థ”, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు దివ్యాంగులకు అండగా ఉంటున్న స్థానిక “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.