హెచ్‌1బీ వీసాదారులకు తీపి కబురు..!

వాస్తవం ప్రతినిధి : హెచ్‌1బీ వీసా ఉన్నవారి పిల్లలకు అమెరికాలోని న్యూజెర్సీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. హెచ్‌1 బీ వీసాదారుల పిల్లల కాలేజీ చదువుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఈ చట్టం అమల్లోకి రాన్నుంది. ఈ కొత్త చట్టం ‘ఎస్‌2555’ పై న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ మంగళవారం సంతకం చేశారు. ఈ చట్టం ప‍్రకారం తల్లిదండ్రులు, లేదా గార్డియన్లు హెచ్‌1 బీ వీసాదారులైనట్లయితే.. వారి డిపెండెంట్‌ పిల్లలకు కాలేజీ లేదా యూనివర్సిటీ కోర్సులో ‘అవుట్‌ఆఫ్‌ స్టేట్‌ ట్యూషన్‌’ ఫీజు ఉండదు. కాని ఈ కొత్త చట్టం వర్తించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. హెచ్‌1 బీ వీసాదారుల పిల్లలు న్యూజెర్సీ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అయి ఉండాలి లేదా న్యూజెర్సీ హైస్కూల్‌లో కనీసం మూడేళ్లు చదవి ఉండాలి అనేది ఆ షరతుల్లో ఒకటి. “ఉన్నత విద్యను పొందడానికి న్యూజెర్సీ వాసులందరూ అర్హులే. అందులో భాగంగానే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాం. విద్యార్థులు తమ లక్ష్యాలను అందుకోవడానికి, వారి ఉజ్వల భవిష్యత్తుకు ఈ చట్టం దోహదం చేస్తుంది” అని బిల్లుపై సంతకం చేస్తున్న సందర్భంలో మర్ఫీ అన్నారు.