పండుగ అంటే ఇది అనేలా..అంబరాన్నంటిన ‘తామా’ సంక్రాంతి సంబరాలు!

వాస్తవం ప్రతినిధి : “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ఖండాంతరాలు దాటినను అమెరికాలో వున్న తెలుగు వారందరు ఏకమై.. భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ప్రతి యేటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ.. భావి తరాలు గుర్తుంచుకునేలా, గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్నారు “ప్రవాస భారతీయులు” అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అమెరికాలోని అట్లాంటాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అట్లాంటాలోని నార్క్రాస్ హై స్కూల్లో జనవరి 18న తామా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) ఆధ్వర్యంలో మన తెలుగువారు సంక్రాంతి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో అట్టహాసంగా జరుపుకున్నారు. శూరా ఇన్వెస్ట్‌మెంట్స్, సంక్రాంతి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, మై టాక్స్ ఫైలర్ వారు సంయుక్తంగా సమర్పించిన ఈ వేడుకలలో 1450 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల కార్యదర్శి సాయిరామ్ కారుమంచి స్వాగతోపన్యాసం అనంతరం కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో 60 మందికి పైగా మహిళలు విభిన్న ముగ్గులతో ఆకట్టుకున్నారు. స్థానిక ప్రవాసులు ప్రదర్శించిన భక్తి గేయాలు, పద్యాలు, టాలీవుడ్ మెడ్లీలు, నాటికలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు, బ్రేక్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ముగ్గులు, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. టాలీవుడ్ గాయనీగాయకులు దామిని, ధనుంజయ్ తమ పాటలతో, ఆటలతో, సరదా మాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంక్రాంతి రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన వంటకాలు, అరిసెలు షడ్రసోపేతంగా ఉన్నాయని అక్కడికి విచ్చేసిన పలువురు ప్రశంసించారు. తామా ‘గో గ్రీన్’ లో భాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, స్పూన్లు, వాటర్ స్టేషన్స్ వాడటం, ప్లాస్టిక్ రహితంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయం. ఈ కార్యక్రమం ఇంకాసేపు ఉంటే చాలా బాగుండేదని, అలాగే వేదిక అలంకరణ సినిమా సెట్టింగులా ఉందని కొనియాడారు అక్కడికి విచ్చేసిన ప్రవాసులు. అంత పెద్ద పాఠశాలలో వాహనాల పార్కింగ్ దొరకటం కొంచెం కష్టం కావడం, ఆఖరి దాకా ప్రేక్షకులతో హాలు నిండి ఉండడం ఈ కార్యక్రమం ఎలా జరిగిందో తెలియజేస్తుంది. చివరగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్రాంతి సంబరాలని విజయవంతం చేసిన అట్లాంటా ప్రజలకు, స్పాన్సర్స్‌కి, ముఖ్య అతిథులకి, నార్క్రాస్ స్కూల్ యాజమాన్యానికి, వీడియో, స్టేజ్ సేవలందించిన బైట్ గ్రాఫ్‌కి తామా బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి తామా ఉపాధ్యక్షులు ఇన్నయ్య ఎనుముల తామా టీం తరఫున ధన్యవాదాలు తెలిపి సంక్రాంతి ఉత్సవాలను దిగ్విజయంగా ముగించారు.