తగలబడిన వైఎస్ఆర్ విగ్రహం..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యవసర అసెంబ్లీ సమావేశాలలో అమరావతి రాజధాని గురించి ప్రతిపక్ష మరియు అధికార పార్టీ నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకోవడంతో అర్ధరాత్రి అసెంబ్లీ సమావేశాలలో వికేంద్రీకరణ బిల్లు ఆమోద ముద్ర పొందడం జరిగింది. అయితే ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో గోల గోల చేయడంతో 17 మంది ఎమ్మెల్యేలు సభ నుండి సస్పెండ్ అయ్యారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోద ముద్ర పొందడంతో అమరావతి ప్రాంతంలో దొండపాడు గ్రామంలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో వెంటనే గ్రామంలో ఉన్న వైసిపి కార్యకర్తలు విగ్రహం వద్ద చేరుకుని నిరసనలు చేపట్టారు. పోలీసులు ఈ విషయం తెలుసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని భద్రతా బలగాలను అదనపు బలగాలను ఆ గ్రామంలో మోహరింపు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వైసిపి పార్టీ నేతలు డిమాండ్ చేశారు.