సమవుజ్జీల సమరంలో ఆఖరి ఘట్టం నేడే

వాస్తవం ప్రతినిధి: మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెల్చుకొని సమంగా నిలిచాయి. సమవుజ్జీల సమరంలో ఆఖరి ఘట్టానికి వేళైంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్లతో గెలుపొందగా… రెండో వన్డేలో భారత్‌ 36 పరుగులతో ఆసీస్‌ను చిత్తుచేసి 1-1తో లెక్కను సరిచేసింది. ఇప్పుడు అసలు సిసలు మజాకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఆఖరి సమరం. మరి చిన్నస్వామిలో ఎవరిని వరమాల వరించనుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో వన్డేను గెల్చుకొని టైటిల్‌ రేసులో నిలిచాయి. తాడో పేడో తేల్చుకోవాల్సిన నిర్ణయాత్మక మూడో, చివరి వన్డేకు బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికైంది. తొలిగా బ్యాటింగ్‌ చేసిన జట్టు 350 పైచిలుకు పరుగులు చేసినా గెలుపు ఆశలు తక్కువేనని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరేముందు పటిష్ట ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ గెలవాలని కోహ్లీ సేన ఉబలాట పడుతుండగా… ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ మాత్రం తమజట్టు విదేశీ పిచ్‌లపైనా రాణించగలదని ఋజువు చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆఖరి వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది.

భారతజట్టు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, చాహల్‌, శిఖర్‌ ధావన్‌, శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, కేదర్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, కెఎల్‌ రాహుల్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌.

ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమ్మిన్స్‌, అస్టన్‌ అగర్‌, హ్యాండ్స్‌కోంబ్‌, హేజిల్‌వుడ్‌, లబూషేన్‌, రిచర్డుసన్‌, ఆర్సీ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మిఛెల్‌ స్టార్క్‌, ఆర్నెర్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా.